అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం బిల్లు పెట్టాలి
అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు 2019 తర్వాత నమోదైన యువ న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా పరిమితి పెంచాలని కోరుతూ లా సెక్రటరీ రెండ్ల తిరుపతికి శుక్రవారం సెక్రటేరియట్ లో న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు న్యాయవాద సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దిలీప్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ఆగాలంటే వెంటనే న్యాయవాద రక్షణ చట్టం బిల్లును అసెంబ్లీలో పెట్టాలాన్నారు. 2019 తర్వాత నమోదైన యువ న్యాయవాదులు హెల్త్ కార్డులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా ఆరోగ్య బీమా పరిమితి రూ. 2 లక్షల రూ. 5 లక్షలకు పెంచాలని కోరారు. స్టేట్ నోటరీల నోటిఫికేషన్ జారీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసుపత్రుల సౌకర్యం కల్పించాలన్నారు. కొత్త నేర చట్టాల్లో సవరణలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు గొల్లపూడి రామారావు, తోటకూర శ్రీనివాసరావు, కొండపల్లి శ్రీనివాస్ చౌదరి పాల్గొన్నారు.